: మీడియా తీరు అభినందనీయం: పోలీసుల దౌర్జన్యం కేసులో మద్రాసు హైకోర్టు వ్యాఖ్య
ఓ కుటుంబంపై నడి రోడ్డులో పోలీసుల దౌర్జన్యం చేసిన ఘటనలో ఎలక్ట్రానికి మీడియా మంచి పాత్ర పోషించిందని మద్రాసు హైకోర్టు అభినందించింది. సోమవారం మధ్యాహ్నం తిరువణ్ణామలై జిల్లా సెంగం పట్టణంలో తేకవాడియ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రాజ, భార్య ఉష, కుమారుడు సూర్య కలసి బంగారం కొనేందుకు ఓ దుకాణానికి వెళ్ళారు. అయితే, బంగారం కొనే సమయంలో భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారిద్దరూ, కుమారుడు షాపు బయటకు వచ్చి గొడవపడ్డారు. అక్కడే ఉన్న నమ్ ఆల్వార్, మురుగన్, విజయకుమార్ అనే ముగ్గురు పోలీసులు రాజ, భార్య ఉష వద్దకు వచ్చి నడి రోడ్డుపైన ఏంటీ గొడవ? అని ప్రశ్నించారు. ఇది తమ కుటుంబ వ్యవహారమని, మధ్యలోకి రావొద్దని ఆ దంపతులు సమాధానమివ్వడంతో రెచ్చిపోయిన ఖాకీలు ఆ ముగ్గురినీ విచక్షణారహితంగా కొట్టారు. వారి విచక్షణా రహిత దాడిలో రాజ, సూర్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసిన వ్యక్తులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, దీనిని చేజిక్కించుకున్న టీవీ ఛానెల్స్ ప్రసారం చేశాయి. దీంతో ఆ సాయంత్రం రాజ బంధువులు పోలీస్ స్టేషన్ బయట ఆందోళనకు దిగారు. నిందితులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో దౌర్జన్యం చేసిన పోలీసులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని బాధితులు దాఖలు చేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టిన సందర్భంగా మద్రాసు హైకోర్టు మీడియాను అభినందించింది. బాధితులను మెరుగైన వైద్యం కోసం చెన్నై ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది.