: మూడో భార్యను తుపాకీతో కాల్చి చంపిన ఐటీ ఉద్యోగి!

ఐటీ ఉద్యోగి అయిన భర్త తన డాక్టరు భార్యను కాల్చి చంపిన విషాద సంఘటన పుణెలో జరిగింది. మధ్యప్రదేశ్ కు చెందిన మనోజ్ పాటిదర్ (38) పుణెలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతని భార్య డాక్టరు అంజలి పాటిదర్ (34) గైనకాలజిస్ట్. కుటుంబ కలహాల కారణంగా నిన్న రాత్రి వాళ్లిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మనోజ్ తన తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. తర్వాత, ఏడాదిన్నర వయసున్న తమ కుమారుడిని అక్కడే వదిలి పెట్టి అతను పారిపోయాడు. పుణె నుంచి తన స్వస్థలానికి అతను తప్పించుకునేందుకు యత్నిస్తుండగా పోలీసులు మనోజ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మనోజ్ గత వారంలో రూ.20 వేలతో ఒక తుపాకీ కొన్నాడని, దాంతోనే తన భార్యను కాల్చి చంపాడని చెప్పారు. మనోజ్ కు గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయని, వాళ్లిద్దరూ కూడా అనుమానాస్పద స్థితిలోనే మృతి చెందినట్లు తమ విచారణలో తేలిందన్నారు.