: నేను కొట్టలేదు...ఆమే కొట్టింది...ఊరు మొత్తం అబద్ధమాడుతోంది: టీవీ నటి శ్రీవాణి
వికారాబాద్ సమీపంలోని పరిగి గ్రామంలో వదిన అనూషపై దాడి చేసి, ఇల్లు కూల్చేశానని వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని టీవీ నటి, వంటల కార్యక్రమ యాంకర్ శ్రీవాణి తెలిపింది. తనపై వస్తున్న ఆరోపణలపై హైదరాబాదులో వివరణ ఇచ్చిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన వదినే తనపై దాడి చేసి కేసు పెట్టిందని తెలిపింది. తన వదినతో పాటు పరిగి గ్రామస్థులు కూడా అబద్ధం ఆడుతున్నారని తెలిపింది. ఆ ఆస్తులు తన తండ్రివని, వాటితో తనకు సంబంధం లేదని చెప్పింది. తన తరపున వచ్చిన వాటా కావాలంటే తన వదినకు రాసి ఇచ్చేస్తానని శ్రీవాణి తెలిపింది. తన వదిన తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆమె చెప్పింది. దీనిపై ఆమె భర్త ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ, దీనిపై వ్యాఖ్యానించడానికి చుట్టుపక్కల వారు ఎవరని ప్రశ్నించారు. అనూష పెట్టిన కేసు లీగల్ గా నిలబడదని, కోర్టు తీర్పును అనుసరించి నడుచుకుంటామని చెప్పారు. ఇదే విషయంపై శ్రీవాణి తండ్రి మాట్లాడుతూ, పరిగిలో ఉన్న ఆస్తి తన కష్టార్జితమని, దానిని తన కుమార్తెలందరికీ సమానంగా పంచుతానని అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. మరి ఇన్నాళ్లు ఆ ఇంట్లో లేకుండా ఎక్కడున్నారు? అని అడగడంతో... తాను వేరే చోట అద్దెకి ఉంటున్నానని ఆయన తెలిపారు. అయితే ఇప్పుడు తన కొడుకు లేడు కనుక... ఇక ఆ ఆస్తిని తాను తీసుకుంటానని అన్నారు.