: ఎవరైనా కల్పించుకుంటే సౌత్ చైనా సముద్రం యుద్ధభూమే: చైనా తీవ్ర హెచ్చరిక
దక్షిణ చైనా సముద్రంపై పెత్తనాన్ని ఆపాలని హేగ్ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును అంగీకరించేది లేదని ఇప్పటికే స్పష్టం చేసిన చైనా, మరో తీవ్ర హెచ్చరికను జారీ చేసింది. ఈ వివాదంలో తమ హక్కులకు భంగం వాటిల్లేలా చేయాలని ఏ దేశం ప్రయత్నించినా సౌత్ చైనా సముద్రం ఓ యుద్ధభూమిగా మారుతుందని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయమంత్రి లియూ జెన్ మిన్ హెచ్చరించారు. యూఎన్ ట్రైబ్యునల్ తీర్పును ఆమోదించాలని తమకు ఓ డజను దేశాలు సలహాలు ఇస్తున్నాయని, ఆ దేశాల అభిప్రాయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదని, సముద్రంలో 90 శాతం తమదేనని ఆయన స్పష్టం చేశారు. యూఎస్ సహా పలు యూరప్ దేశాలు చైనా వ్యవహారాల్లో కల్పించుకోవాలని చూస్తున్నాయని, దీన్ని సహించబోమని అన్నారు. అయితే, అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. అంతమాత్రాన తమకు అన్యాయం జరిగే తీర్పులు ఇస్తుంటే ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు. సముద్ర గగన తలంలో విమానాల రాకపోకలపై ఆంక్షలు పెడతామని, ఈ ప్రాంతాన్ని ఎయిర్ డిఫెన్స్ జోన్ గా ప్రకటించేందుకు వెనుకాడబోమని నిన్న లియూ జెన్ మిన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతానికి ఈ వివాదంలో వేలు పెట్టకూడదని భారత్ భావిస్తోంది.