: నిందితుడి డెబిట్ కార్డుతో రూ.16 లక్షలు వాడుకున్న పోలీస్ అధికారి
నిందితుడి డెబిట్ కార్డును ఉపయోగించి ఓ పోలీసు అధికారి రూ.16 లక్షలను వాడుకున్న ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఓ వ్యాపారవేత్త డెబిట్ కార్డును బలవంతంగా తీసుకుని అతని డబ్బుని తన స్వంత డబ్బులా పోలీసు అధికారి ఉపయోగించుకున్నాడు. అంధేరికి చెందిన శిరీష్ దలాల్(54) వ్యాపారం చేస్తుంటాడు. స్వంతంగా ఆయనకి ఓ కంపెనీ ఉంది. ఆయన బ్యాంక్‌కు రూ.2 కోట్లు బకాయిపడ్డాడు. దీంతో బ్యాంకు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆ వ్యాపారి కంపెనీని సీజ్ చేశారు. దీంతో తన స్వంత కంపెనీలోనే పలు విలువైన యంత్రాలను ఆయన దొంగిలించాడు. ఈ కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి విచారణ నిమిత్తం ఏప్రిల్ 27వ తేదీ వరకు ఆ వ్యాపారి పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న వ్యాపారికి గత నెల 13వ తేదీన బెయిల్ లభించింది. దీంతో జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన తన డెబిట్ కార్డు నుంచి డబ్బులు డ్రా అయినట్లు గమనించాడు. దీంతో తాను కస్టడీలో ఉన్న సమయంలో తనను విచారిస్తోన్న అసిస్టెంట్ పోలీసు ఇన్‌స్పెక్టర్ బుజంగ్ బలవంతంగా తన డెబిట్ కార్డును లాక్కున్నాడని శిరీష్ దలాల్ ఫిర్యాదు చేశాడు. దానికి సంబంధించిన పిన్ నెంబర్ ను కూడా బుజంగ్ తీసుకున్నాడని ఆయన పేర్కొన్నాడు. తన నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లనూ తీసుకొని పోలీస్ అధికారి తన డబ్బుని వాడుకున్నాడని శిరీష్ దలాల్ ఫిర్యాదు చేశాడు. తన డెబిట్ కార్డును ఉపయోగించి పోలీసు అధికారి ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొన్నట్లు, దానితో ఏటీఎంలలో నగదు డ్రా చేసినట్లు తాను గుర్తించినట్లు వ్యాపారి పోలీసులకి తెలిపాడు. అంతేగాక, తన డెబిట్ కార్డును ట్రావెల్స్‌లలో టికెట్లు బుక్‌చేయడం వంటి పలు అంశాల్లో ఉపయోగించుకున్నాడని మోసపోయిన వ్యాపారి చెప్పాడు. తన డెబిట్ కార్డు ద్వారా మొత్తం సదరు పోలీసు అధికారి రూ. 16 లక్షలు వాడుకున్నాడని ఆయన పేర్కొన్నాడు. వ్యాపారి చేసిన ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.