: కాల్చిన కర్రు పట్టించి భార్యకు శీల పరీక్ష చేయబోయిన కృష్ణా జిల్లా వాసి!... అరెస్ట్ చేసిన పోలీసులు


కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు సకాలంలో స్పందించకపోయి ఉంటే ఓ అమాయకురాలికి పెద్ద అవమానమే జరిగేది. ఆరోగ్యపరంగా పెద్ద చిక్కులు ఆమెకు తప్పేవి కావు. ఆధునిక ప్రపంచంలోనూ ఆదివాసీల మాదిరి మూఢాచారాలు ఇంకా అమలులోనే ఉన్నాయన్న నగ్న సత్యాన్ని కళ్లకు కడుతున్న ఈ ఘటన పెను కలకలం రేపుతోంది. వివరాల్లోకెళితే... జిల్లాలోని జగ్గయ్యపేటకు చెందిన తానేష్ అనే వ్యక్తి తన భార్య శీలంపై అనుమానం పెంచుకున్నాడు. సభ్య సమాజం తల దించుకునేలా ఆమెను శీల పరీక్షకు ఒప్పించాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుల పెద్దలు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో కాల్చిన కర్రును చేతితో పట్టుకుంటే... చేతులు కాలకపోతే శీలవతి అయినట్లు, లేకపోతే శీలం లేనట్లేనని అనాది ఆచారాన్ని రంగంలోకి తెచ్చారు. ఇదంతా పెను దుర్మార్గమని గ్రహించలేని ఆ యువతి శీల పరీక్షకు ఒప్పేసుకుంది. అంతా సిద్ధమైపోయింది. కుల పెద్దలంతా ఓ చోట చేరారు. అందరి ముందే కాల్చిన కర్రును పట్టుకునేందుకు ఆ అమాయకురాలు సిద్ధపడింది. అయితే అప్పటికి కాస్త ముందుగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు పరుగులు పెట్టారు. సకాలంలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు శీల పరీక్ష నుంచి ఆ యువతిని కాపాడి, సొంత భార్యపైనే అనుమానం పెంచుకుని దారుణ హింసకు పాల్పడేందుకు యత్నించిన తానేష్ ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News