: ఢిల్లీలో స్ట్రీట్ ఫైట్!...యువకుడిపై 12 మంది మూకుమ్మడి దాడి!: వైరల్ గా మారిన వీడియో
హద్దులు మీరుతున్న యువత స్ట్రీట్ ఫైట్ లకు దిగుతోంది. ఈ తరహా కొత్త సంప్రదాయానికి భాగ్యనగరి హైదరాబాదు ఒక్కటే వేదిక కాదు. దేశ రాజధాని ఢిల్లీ కూడా ఈ తరహా వీధి పోరాటాలకు ఆలవాలంగా మారుతోంది. బైకును ఢీకొట్టాడన్న చిన్న కారణంతో ఓ యువకుడిని ఒక్కడిని చేసి 12 మంది ఆకతాయిలు అతడిపై మూకుమ్మడి దాడికి దిగారు. ఈ ఘటనలో బాధిత యువకుడికి తీవ్ర గాయాలు కాగా... విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. నిన్న పట్టపగలు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నేషనల్ మీడియాతో పాటు అన్ని ప్రాంతీయ న్యూస్ ఛానెళ్లలోనూ వైరల్ గా మారింది. ఘటనలో రెండు బైకులు ఢీకొనగా... సింగిల్ గా ఉన్న ఓ యువకుడిపై అతడి బైకు ఢీకొన్న వాహనానికి చెందిన ఆకతాయిలు నడిరోడ్డుపైనే దాడికి దిగారు. ఏకంగా 12 మంది దండెత్తి వచ్చి తనపై దాడి చేస్తుంటే... బాధిత యువకుడు ఏమీ చేయలేకపోయాడు. నడిబజారులో ఈ దాడి జరుగుతున్నా... అక్కడున్న వారిలో ఏ ఒక్కరు కూడా ఈ దాడిని ఆపేందుకు యత్నించకపోవడం గమనార్హం. ఆకతాయి యువకుల వీరంగం చూసిన తర్వాతే ఢిల్లీ వాసులు ఈ దాడిని అడ్డుకోలేకపోయారని సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్దారు.