: మైనింగ్ శాఖలో అక్రమాలపై కొరడా ఝుళిపించిన తెలంగాణ మంత్రి కేటీఆర్
మైనింగ్ శాఖలో అక్రమాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు కొరడా ఝుళిపించారు. మైనింగ్, ఇసుక తవ్వకాలపై ఆయన ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్ అక్రమాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లోని గుడిబండ రీచ్‌ను ఆయన రద్దు చేశారు. ఏడీ కృష్ణ ప్రతాప్, రాయల్టీ ఇన్స్‌పెక్టర్ రవికుమార్ సస్పెన్షలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడ్డ కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలకు ఆదేశించారు. నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని ఇసుక తవ్వకాలపై ఆయన నివేదికలు తెప్పించుకుని పరిశీలించారు. ఉన్నతస్థాయి అధికారులతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించారు. గనుల శాఖలోని వివిధ అంశాలపై కేటీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రీచ్, మైనింగ్ ప్రాంతాలను పరిశీలించి, పర్యవేక్షించాలని ఆయన సూచించారు. మైనింగ్ ఆదాయం జాతి సంపద అని, అది ప్రజలకే చెందాలని ఆయన అన్నారు.