: పాకిస్థాన్ వ్యాఖ్యలపై మండిపడ్డ భారత్.. 'ఐరాస'లో దీటైన సమాధానం ఇచ్చిన ఇండియా
భారత్ అంతర్గత వ్యవహారాలపై అనవసరంగా కల్పించుకుంటూ చేస్తోన్న పాకిస్థాన్ వ్యాఖ్యల పట్ల ఇండియా దీటైన సమాధానమిచ్చింది. ఇటీవల కాశ్మీర్‌లో ఉగ్రవాది బుర్హాన్‌ను భారత్ ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడ అల్లర్లు చెలరేగాయి. ఈ అంశంపై ఓ పక్క భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోలేమని అమెరికా ప్రకటిస్తే, మరోపక్క పాకిస్థాన్ బుర్హాన్ మృతిపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. పాకిస్థాన్ చర్యపై ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో భారత్ గట్టిగా సమాధానం చెప్పింది. అక్కడ జరిగిన మానవ హక్కులపై చర్చలో భాగంగా యూఎన్‌కు భారత అంబాసిడర్ అయిన సయ్యద్ అక్బరుద్దీన్ భారత్‌లో జరుగుతోన్న అంశాలపై పాకిస్థాన్ జోక్యం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పాకిస్థాన్ ఇతర దేశాల భూభాగాలను కోరుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ అంబాసిడర్ మలీహా లోధి భారత్‌లోని కాశ్మీర్ అంశంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను సయ్యద్ అక్బరుద్దీన్ తిప్పికొడుతూ.. 'ఐక్యరాజ్యసమితి వేదికను గతంలో పాకిస్థాన్ ఎలా ఉపయోగించుకుందో మనకు తెలుసు' అన్నారు. ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి జాబితాలో ఉన్న ఉగ్రవాదులకు సైతం వారి దేశంలో చోటు కల్పించే పాకిస్థాన్ మానవ హక్కులపై మాట్లాడడం ఆశ్చర్యకరమే అని ఆయన అన్నారు. ఉగ్రవాదులకు అనుకూలంగా ప్రవర్తిస్తుండడంతోనే పాకిస్థాన్‌కి ఐరాస మానవ హక్కుల సంఘంలో సభ్యత్వం ఇవ్వలేదని సయ్యద్ అక్బరుద్దీన్ గుర్తుచేశారు. ఇండియాపై ద్వేష పూరితంగా ఫిర్యాదులు చేస్తోన్న పాకిస్థాన్ పట్ల ఐక్యరాజ్యసమితి సానుకూలంగా వ్యవహరించబోదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తూ ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటోందని మానవ హక్కుల రక్షణకు ఇండియా కట్టుబడే ఉంటుందని ఆయన చెప్పారు.