: ఓక్రిడ్జ్ స్కూల్లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత హరితహారం కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. పలు జిల్లాల్లో తెలంగాణ మంత్రులు, అధికారులు ప్రజలతో కలిసి మొక్కలు నాటి వారిని ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సతీమణి శైలిమ ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. గచ్చిబౌలికి సమీపంలో ఉన్న కాజాగూడలోని ఓక్రిడ్జ్ స్కూల్లో విద్యార్థులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. హరితహారంలో అందరూ పాల్గొనాలని ఆమె అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని ప్రభుత్వ వైద్యశాలలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హరితహారంలో పాల్గొన్నారు. హైదరాబాద్ శివారు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎంపీ మల్లారెడ్డి పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజలందరూ హరితహారంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం రాపల్లిలో ఎల్లంపల్లి పునరావాస గృహాల్లో మంత్రి జోగురామన్న, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి హరితహారంలో పాల్గొన్నారు. ప్రజా ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.