: మా 'యుద్ధ మంత్రి' మరణించాడు: స్వయంగా ప్రకటించిన ఐఎస్ఐఎస్


ఐఎస్ఐఎస్ రాజ్యంలో యుద్ధ మంత్రిగా ఉన్న అబూ ఒమర్ అల్ శిషానీ మరణించాడు. ఇరాక్ లోని మోసుల్ కు దక్షిణాన ఉన్న షిర్ ఖాత్ నగరంలో జరిగిన యుద్ధంలో ఆయన మరణించినట్టు ఉగ్రవాద గ్రూప్ నిర్వహిస్తున్న న్యూస్ ఏజన్సీ 'అమాక్' ప్రకటించింది. కాగా, ఈ సంవత్సరం మార్చిలోనే తాము జరిపిన యుద్ధ విమానాల దాడిలో అబూ ఒమర్ మరణించాడని పెంటగాన్ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన మరణాన్ని స్వయంగా ఐఎస్ఐఎస్ ధ్రువీకరించడం మాత్రం ఇదే తొలిసారి. అబూ ఒమర్ మృతిపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సామాజిక మాధ్యమాల్లో సంతాపాలు వెలిబుచ్చుతూ, ఆయన చిత్రాలను పోస్ట్ చేస్తున్నారు. అమాక్ వెల్లడించిన వార్తా కథనాన్ని పరిశీలిస్తున్నామని పెంటగాన్ అధికారులు తెలిపారు. అబూ ఒమర్ తో పాటు మరింతమంది ఉగ్రవాదులు మరణించారని ఇరాక్ రక్షణ రంగ నిపుణులు హిషామ్ అల్ హషిమి తెలిపారు. ఇరాక్ సైన్యం మోసుల్ నగరం దిశగా నడుస్తోందని, సాధ్యమైనంత త్వరలోనే ఉగ్రవాదుల చెర నుంచి నగరాన్ని విడిపిస్తామని తెలిపారు. మొత్తం 250 కి.మీ పరిధిలో మాత్రమే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పరిమితం చేశామని వివరించారు. ఇదిలావుండగా, అబూ మార్చిలో యూఎస్ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడని, ఆపై చికిత్స పొందుతూ ఇప్పుడు మరణించి ఉండవచ్చని సిరియా మానవ హక్కుల పరిశీలకుడు రమీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు.

  • Loading...

More Telugu News