: డ్రంకన్ డ్రైవింగా?... బెట్టింగా?: ‘రమ్య కేసు’లో శ్రావెల్ కు ముగిసిన కస్టడీ!
మైనారిటీ తీరని కుర్రాళ్ల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మృత్యువాత పడ్డ హైదరాబాదీ చిన్నారి రమ్య కేసులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూసేలా ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్ తో రమ్య మరణానికి కారణమైన ప్రధాన నిందితుడు శ్రావెల్ కు పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో అతడిని నేడు నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో తమ కస్టడీలో ఉండగా శ్రావెల్ వెల్లడించిన వివరాలతో కూడిన నివేదికను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు శ్రావెల్ ర్యాష్ డ్రైవింగ్ కు మద్యపానమొక్కటే కారణం కాదని తెలుస్తోంది. హైదరాబాదు రోడ్లపై వికృత క్రీడ బెట్టింగ్ (కారు, బైకు రేసులు) కూడా కారణమై ఉండవచ్చన్న వాదన వినిపిస్తోంది. అసలు ఈ కేసులో మద్యపానమే ప్రధానం కాదన్న వాదనా లేకపోలేదు. కేవలం ఫ్రెండ్స్ తో బెట్టింగ్ కట్టి శ్రావెల్ తన కారును ర్యాష్ గా డ్రైవ్ చేశాడని తెలుస్తోంది. ఒకవేళ మద్యం సేవించినా... అతడు ఎంతమేర మద్యం తాగాడన్న విషయాన్ని కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టుకు పోలీసులు సమర్పించే నివేదికపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.