: బద్ధకం వీడకపోతే నిధులు లాగేసుకుంటాం!.. ఏపీకి కేంద్రం వార్నింగ్!
నిధుల లేమితో నానా పాట్లు పడుతున్న నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ షాకిచ్చింది. నిధుల విడుదలలో మీన మేషాలు లెక్కిస్తున్న కేంద్రం... ఇచ్చిన నిధులను సకాలంలో సద్వినియోగం చేయకపోతే, మరిన్ని నిధుల మాట అటుంచి ఇచ్చిన నిధులను వెనక్కు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. అయినా ఇచ్చిన నిధులను ఖర్చు చేయడంలో అంత బద్ధకమెందుకంటూ ఘాటుగా ఓ లేఖ రాసింది. వివరాల్లోకెళితే... ఏపీలో రోడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందని కేంద్రం ఆరోపిస్తోంది. రాష్ట్రానికి తగినన్ని ప్రాజెక్టులతో పాటు వాటికి సరిపడ నిధులను ఇచ్చినట్లు కేంద్రం చెబుతోంది. ఈ పనులు ఆశించిన మేర వేగంగా సాగడం లేదన్నది కేంద్రం వాదన. ఈ క్రమంలో ఇటీవల ఏపీకి కేంద్రం ఓ లేఖ రాసింది. సదరు లేఖకు సమాధానమిచ్చిన ఏపీ సర్కారు... జాప్యానికి గల కారణాలను వివరించింది. అయితే ఏపీ చెబుతున్న కారణాలపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేయకపోగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవేం కారణాలంటూ ఎదురు ప్రశ్నించింది. తమ అధికారులు వచ్చి రోడ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారని, అందులో వెల్లడయ్యే లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటికీ పనుల్లో వేగం నమోదు కాకపోతే... ఇచ్చిన నిధులను వెనక్కు తీసుకుంటామని వార్నింగిచ్చింది.