: హైదరాబాద్ లో 13 చోట్ల పేలుళ్లకు ఉగ్ర కుట్ర... మరో బృందం రెడీ!
హైదరాబాద్ లో పెను విధ్వంసానికి ప్రణాళిక రచించిన ముష్కరమూక మొత్తం 13 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నిందని, ఇందులో పోలీసు స్టేషన్లు, జన సమ్మర్థమున్న మాల్స్, రక్షణ రంగ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. వీటన్నిటి వివరాలతో ఇక్కడి నుంచి విదేశాల్లో ఉన్న వారి బాస్ లకు ఎప్పటికప్పుడు ఈ-మెయిల్స్ తదితర మాధ్యమాల ద్వారా సమాచారం పంపుతున్నారని, రాష్ట్రంలోని ఆరుగురు ప్రముఖులను హత్య చేయాలని కూడా వీరు కుట్ర పన్నారని తేల్చారు. ఇక ఐసిస్ అనుబంధ జేకేబీహెచ్ (జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్)కు నిధులందించిన ఫైనాన్షియర్లను తక్షణం అదుపులోకి తీసుకోకుంటే, మరో ఉగ్ర బృందం వారి కార్యాచరణ అమలుకు ఏర్పడుతుందని ఎన్ఐఏ ఆందోళన చెందుతోంది. వీరిని గుర్తించేందుకు ఉగ్రవాదులను మరింతగా విచారించాల్సి వుందని అధికారులు అంటున్నారు. రాజస్థాన్ ప్రాంతం నుంచి హవాలా ఏజంట్ల ద్వారా ఇక్కడి ఉగ్రవాదులకు నిధులు వచ్చాయని, ఇవి రియాల్స్ కరెన్సీలో రాగా, వాటిని ఇక్కడే మార్చుకున్నారని కూడా విచారణలో వెల్లడైంది. అరెస్టయిన నిందితులు తమ మనసులో ఉన్న పూర్తి వివరాలను వెల్లడించడం లేదని అభిప్రాయపడుతున్న విచారణాధికారులు, ఇప్పటికే ఇదే విషయాన్ని కోర్టుకు సైతం వెల్లడించారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న నలుగురినీ పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి ఆధారాలు సేకరించాలని భావిస్తున్నారు.