: చంద్రబాబు అభ్యంతరం ఎఫెక్ట్!... ధవళేశ్వరానికి తరలిపోతున్న ‘పోలవరం’ కార్యాలయం!


తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు ఏపీలోకి వెళ్లిపోయింది. ఈ ప్రాజెక్టు ముంపు గ్రామాలు కూడా తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ అయిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాదులో ఇంకా సదరు ప్రాజెక్టు కార్యాలయం ఎందుకుండాలన్న రీతిలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భావించారు. వెరసి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కార్యాలయం హైదరాబాదు నుంచి ప్రాజెక్టుకు సమీపంలోని ధవళేశ్వరం వద్దకు తరలిపోతోంది. వివరాల్లోకెళితే... పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో నాడు రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాదులో పీపీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తలచారు. ఈ క్రమంలో ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోవడంతో కేంద్ర జల సంఘం కార్యాలయంలోనే దానికి ఓ గది కేటాయించారు. తదనంతర కాలంలో సోమాజీగూడలో ఓ అద్దె భవనాన్ని ఈ కార్యాలయం కోసం తీసుకున్నారు. అయితే అద్దె భవనంలోకి మారే విషయంలో ముందూ వెనుకా ఆలోచించిన పీపీఏ కార్యాలయ సిబ్బంది కేంద్ర జల సంఘం కార్యాలయంలోని తాత్కాలిక గదిలోనే ఉండిపోయారు. తాజాగా అద్దెకు తీసుకున్న భవనానికి తమ కార్యాలయాన్ని తరలిస్తామని, అందులో సౌకర్యాల కల్పనకు రూ.2.5 కోట్లు కేటాయించాలని పీపీఏ ప్రభుత్వానికి లేఖ రాసింది. తన వద్దకు వచ్చిన ఈ లేఖపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలు ఏపీకి తరలిపోతుంటే... పీపీఏ కార్యాలయం మాత్రం హైదరాబాదులో ఎందుకుండాలంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా తాత్కాలిక ప్రాతిపదికగా ఏర్పాటు చేయనున్న కార్యాలయానికి రూ.2.5 కోట్లతో మెరుగులెందుకంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టు పనులను నిత్యం పర్యవేక్షించేందుకు ధవళేశ్వరం వద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నోట్ రాసి ఆ లేఖను తిప్పిపంపారు. దీంతో త్వరలోనే ధవళేశ్వరం వద్ద పీపీఏ కార్యాలయం ఏర్పాటు కానుంది.

  • Loading...

More Telugu News