: ఇక డీఎంకే వంతు!... కేంద్ర మాజీ మంత్రి జగద్రక్షకన్ పై ఐటీ సోదాలు!
ఇటీవల ముగిసిన తమిళనాడు ఎన్నికల్లో తలబొప్పి కట్టిన డీఎంకేకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి మిత్రపక్షంగా ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై వరుస పెట్టి ఐటీ, సీబీఐ సోదాలు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పెను కలకలం రేపాయి. తాజాగా డీఎంకే సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జగద్రక్షకన్ పైనా ఐటీ కొరడా ఝుళిపించింది. నిన్న ఉదయమే రంగంలోకి దిగిన ఆదాయపన్ను శాఖ అధికారులు చెన్నై మహానగరంలోని నుంగంబాక్కం, అడయార్, క్రోంపేట, టీ నగర్, మహాబలిపురం, పాండిచ్ఛేరి తదితర ప్రాంతాల్లోని 40 చోట్ల ముమ్మర సోదాలు చేశారు. ఈ సోదాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే స్థిరాస్తుల పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే జగద్రక్షకన్ పై పెద్ద సంఖ్యలో ఆరోపణలు వెల్లువెత్తాయి.