: బ్యాంక్ లాకర్ లో నగలు మాయం!
ఇంట్లోని బీరువాల్లో నగలు ఉండడం శ్రేయస్కరం కాదని భావించే వారంతా బ్యాంకు లాకర్లను ఆశ్రయిస్తారు. తాజాగా హైదరాబాదులోని అబిడ్స్ గన్ ఫౌండ్రీలోని ఎస్బీహెచ్ లో చోటుచేసుకున్న ఘటనతో బ్యాంకు లాకర్లు కూడా సురక్షితం కాదనే భావనను కలిగిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... రాజేంద్రనగర్ కు చెందిన అస్నా ఫర్ఖూందా తాజ్ అనే మహిళ తనకు సంబంధించిన 15 తులాల బంగారు ఆభరణాలను అబిడ్స్ దగ్గర గన్ ఫౌండ్రీలోని ఎస్బీహెచ్ లో లాకర్ లో పెట్టారు. నిన్న వచ్చి తన బంగారు ఆభరణాలు తీసుకోవాలని భావించి, బ్యాంకు లాకర్ తెరిచి చూసి షాక్ తిన్నారు. గతంలో ఆమె పెట్టిన 15 తులాల బంగారు ఆభరణాలు ఆమెకు కనిపించలేదు. దీంతో లబోదిబోమన్న ఆమె రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.