: చంద్రబాబు ప్రభుత్వం త్వరగా పోవాలని మీరంతా గట్టిగా ప్రార్థించండి: ప్రజలను కోరిన జగన్
‘చంద్రబాబు నాయుడి ప్రభుత్వం త్వరగా పోవాలని మీరందరూ గట్టిగా ప్రార్థించండి’ అంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరుపల్లిలో తన సభకు హాజరైన ప్రజలను కోరారు. ‘పోలవరం’ నిర్వాసితులతో సమావేశమైన అనంతరం ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఉండదని, మరో సంవత్సరానికో, రెండేళ్లకో తమ ప్రభుత్వం వస్తుందని, పోలవరం నిర్వాసితుల డిమాండ్లను నెరవేరుస్తామని, పూలల్లో పెట్టిమరీ వారికి అందాల్సిన సాయం అందజేస్తామని.. వారి ముఖాల్లో చిరునవ్వులు చూస్తానని జగన్ అన్నారు. ‘నాపై నమ్మకముంచితే నిర్వాసితులడిగినవన్నీ చేసిపెడతాను. చంద్రబాబు నాయుడిపై నా పోరాటం మాత్రం ఆగదు... కచ్చితంగా కొనసాగిస్తాం. పోరాటంతో పాటు దేవుడి దయ కూడా కావాలి... చంద్రబాబు ప్రభుత్వం త్వరగా పోవాలని మీరందరూ కూడా గట్టిగా ప్రార్థించండి’ అని జగన్ అన్నారు.