: ఛత్తీస్ గఢ్ నుంచి తొలి ఒలింపియన్ 'పాల'మ్మాయి!
ఒలింపిక్స్ లో పాల్గొనే భారత హాకీ జట్టులో ఓ నిరుపేద యువతి చోటు సంపాదించి స్పూర్తిగా నిలిచిన ఘటన చత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రియో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత మహిళా హాకీ జట్టులో రేణుకా యాదవ్ చోటు సంపాదించుకుంది. దీంతో ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ లో చోటు దక్కించుకున్న తొలి యువతిగా రేణుకా యాదవ్ చరిత్ర నెలకొల్పింది. పనిమనిషి కుమార్తె అయిన రేణుకా యాదవ్ తెల్లవారుజామునే ఇల్లిల్లూ తిరిగి పాలను విక్రయిస్తుంది. బాల్యం నుంచే హాకీ ఆడేదానినని, తన మొదటి గురువు భూషణ్ అని రేణుక తెలిపింది. తాను పాఠశాలలో ఉండగా జరిగే హాకీ పోటీల్లో రాణించడం చూసిన కోచ్ భూషణ్ మొదటిసారి తనకు హాకీ స్టిక్ బహుమతిగా ఇచ్చారని ఆమె గుర్తు చేసుకుంది. కోచ్ ల ప్రోత్సాహం, కఠోర సాధనతో రియో ఒలింపిక్స్ కు వెళ్లనున్న భారత మహిళా జట్టులో చోటు సంపాదించుకున్నానని. తన జీవితంలో ఇవి చాలా విలువైన క్షణాలని, దేశం తరపున ఒలింపిక్స్ లో రాణిస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.