: తమిళనాడు పీసీసీ చీఫ్ గా ఖుష్బూ?...మీడియాలో కథనాలు
తమిళనాడు పీసీసీ చీఫ్ రేసులో ప్రముఖ నటి ఖష్బూ ఉన్నట్టు తమిళనాట వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం పావులు కదుపుతోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న ఖుష్బూను టీఎన్ సీసీ చీఫ్ గా నియమించే అవకాశాలు ఉన్నాయంటూ తమిళ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. మామూలుగా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. అక్కడ సీనియర్ నేతలైన చిదంబరం, తంగబాలు, ఈవీకేఎస్ ఇలంగోవన్, కుమరి అనంతన్, వసంత్ కుమార్ ఇలా ప్రతి ఒక్కరికి ఒక గ్రూపు ఉందని, వీళ్లంతా 'ఎవరికి వారే యమునాతీరే' అన్న చందంగా ఉంటారని పేరు. వీరిని ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. దీంతో తమిళనాడులో పార్టీని నిలబెట్టేందుకు ఖుష్భూను టీఎన్ సీసీ చీఫ్ ను చేయడంపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖుష్బూను రాహుల్ గాంధీ పిలిపించుకుని మాట్లాడరని కొందరు చెబుతుండగా, అధికార ప్రతినిథిగా ఆమె అభిప్రాయం తెలుసుకునేందుకు పార్టీ అధిష్ఠానం ఆమెను పిలిపించిందని మరి కొందరు పేర్కొంటున్నారు. రాహుల్, సోనియాతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యానని అన్నారు. టీఎన్ సీసీ అధ్యక్షుడిగా మళ్లీ ఈవీకేఎస్ ఇలంగోవన్ నే నియమించాలని తాను చెప్పలేదని ఆమె స్పష్టం చేశారు. అధిష్ఠానానికి అన్నీ తెలుసని చెప్పిన ఆమె, తనకు టీఎన్ సీసీ అధ్యక్షురాలి పదవి ఇస్తే మనసారా స్వీకరిస్తానని అన్నారు. అయితే అందుకు తగ్గ అనుభవాన్ని తాను సంతరించుకోలేదని, పార్టీలో అనుభవజ్ఞులైన నేతలు చాలా మంది ఉన్నారని, వారిలో ఒకరిని టీఎన్ సీసీ చీఫ్ గా ఎన్నుకొంటారని భావిస్తున్నానని ఆమె తెలిపారు.