: పెంపుడు కుక్కలే యజమానిని హతమార్చాయి!
పెంపుడు కుక్కలే తమ యజమానిపై దాడి చేయడంతో ఆయన మృతి చెందిన విషాద సంఘటన తమిళనాడులోని వేలూరులో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి బానవరం పోలీసులు తెలిపిన వివరాలు... గవర్నమెంట్ రైల్వే పోలీసు విభాగంలో కృపాకరం అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. వేలూరుకు సమీపంలో ఆయనకు మామిడి తోట ఉంది. ఈ తోటకు కాపలా నిమిత్తం జర్మనీకి చెందిన రాట్ వీలర్ జాతికి చెందిన ఒక ఆడ కుక్కను పెంచాడు. క్రాసింగ్ నిమిత్తం ఇటీవల ఒక మగకుక్కను ఆయన తీసుకువచ్చాడు. ప్రతిరోజూ తోటకు వెళ్లి ఈ రెండు కుక్కలకు ఆయనే ఆహారం పెడుతుండేవాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి పదిగంటల సమయంలో అక్కడికి వెళ్లిన ఆయన వాటికి ఆహారం పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఆ రెండు కుక్కలు ఆయనపై ఒక్కసారిగా దాడి చేశాయి. కృపాకరం ముఖం, ఛాతీ, పొట్ట భాగాలను ముక్కలు ముక్కలు చేశాయి. దీంతో, ఆయన అరుపులు పెట్టడంతో తోటకు సమీపంలో ఉన్న రైతులు అక్కడికి చేరుకుని, ఆ కుక్కలను చెదరగొట్టారు. రక్తపు మడుగులో పడి ఉన్న కృపాకర్ ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. గాయాల కారణంగా అధిక రక్తస్రావం జరగడంతో ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు.