: జగన్ సభలో జేబుదొంగల చేతివాటం!... చోర శిఖామణులకు వైసీపీ కార్యకర్తల బడితె పూజ!
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కొద్దిసేపటి క్రితం జరిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభలో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అయితే కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించిన వైసీపీ కార్యకర్తలు... చోర శిఖామణులకు బడితె పూజ చేశారు. వివరాల్లోకెళితే... జంగారెడ్డిగూడెంలో జరిగిన జగన్ బహిరంగ సభకు జనం వేలాదిగా తరలివచ్చారు. జగన్ కు ప్రజాభిమానం వెల్లువెత్తడం ఖాయమని ముందే నిర్ధారించుకున్న జేబు దొంగలు కూడా రంగప్రవేశం చేశారు. జగన్ ఉద్వేగభరితంగా చేసిన ప్రసంగంలో జనం లీనం కాగా.. వారి జేబుల్లోని పర్సులను కొల్లగొట్టే పనిలో దొంగలు మునిగిపోయారు. ఈ క్రమంలో చోరుల చేతులు జేబుపై తాకడంతో మేల్కొన్న వైసీపీ కార్యకర్తలు దొంగలను పట్టేశారు. ఆ తర్వాత అక్కడే వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.