: బెజవాడలో గుండు గీయించుకుని బీజేపీ నేతల వినూత్న నిరసన!
నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో ప్రజా సమస్యలపై వినూత్నంగా స్పందిస్తున్న టీడీపీ మిత్రపక్షం బీజేపీ నేటి ఉదయం కూడా మరో వినూత్న నిరసన చేపట్టింది. నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అధికార యంత్రాంగం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ నేటి ఉదయం నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో రోడ్డెక్కిన స్థానిక బీజేపీ నేతలు... నడిరోడ్డు మీద కూర్చుని గుండ్లు గీయించుకున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు మూడు సబ్ వేలు నిర్మించాల్సి ఉండగా, అధికారులు మాత్రం కేవలం ఒక్క సబ్ వేనే ప్రతిపాదించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మూడు సబ్ వేలకు అధికారులు ప్రతిపాదనలు చేయాలని వారు డిమాండ్ చేశారు.