: ఒకే చిరునామాతో 27 వాహనాల రిజిస్ట్రేషన్!... అది కూడా 'లేని' వాహనాలకట!: మంగళగిరి ఆర్టీఏలో ‘మాయ’ దందా!
గుంటూరు జిల్లాలోని నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి కూతవేటు దూరంలోని మంగళగిరి రవాణా శాఖ కార్యాలయం(ఆర్టీఏ)లో భారీ వింత చోటుచేసుకుంది. సదరు కార్యాలయంలో ఎంవీఏగా పనిచేస్తున్న నాగేశ్వరరావు అనే ఉద్యోగి ఒకే చిరునామా పేరిట ఏకంగా 27 వాహనాలను రిజిస్టర్ చేసి నెంబర్లు కూడా ఇచ్చేశారు. ఏదో కార్పొరేట్ కంపెనీ కొనుగోలు చేసిన వాహనాలకు ఆయన రిజిస్ట్రేషన్లు చేశారనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆయన నెంబర్లు కేటాయించి రిజిస్టర్ చేసిన వాహనాలన్నీ అసలు ఉనికిలో లేవు. వాహనాలు ఉన్నట్లుగా నకిలీ దస్తావేజులు సృష్టించిన ఆయన ఈ రిజిస్ట్రేషన్లు చేశారు. అయినా లేని వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేస్తే నాగేశ్వరరావుకు ఏమోస్తుందనేగా మీ డౌటు. ఇక్కడ డౌటు పడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే, దేశీయ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వద్ద కాంట్రాక్టు దక్కించుకునేందుకు రంగంలోకి దిగిన బడా కాంట్రాక్టర్లకు కొమ్ముకాసేందుకు సిద్ధపడ్డ ఆయన భారీ ఎత్తున ముడుపులు అందుకుని ‘మాయ దందా’కు తెర లేపినట్లు రవాణా శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. దీనిపై విచారణ కూడా మొదలైంది. ఈ విచారణలో ఇంకా ఏమేం మాయలు వెలుగుచూస్తాయో చూడాలి.