: సైనిక స్థావరాలపై భీకర దాడులు చేయాలన్న సూత్రధారి!... కంటోన్మెంట్ పై గురిపెట్టిన ఉగ్రవాదులు!
హైదరాబాదు పాతబస్తీలో పట్టుబడ్డ ఐదుగురు ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులు పెను విధ్వంసానికి పథక రచన చేసినట్లు తేలింది. జనావాసాలనే కాకుండా దేశ రక్షణ, సైనిక స్థావరాలపై కూడా భీకర దాడులకు వారు పథక రచన చేసినట్లు తాజాగా వెలుగుచూసింది. పాతబస్తీలో ఏర్పాటు చేసుకున్న మకాం నుంచి వారు విదేశాల్లో ఉన్న సూత్రధారితో పలుమార్లు ఫోన్ లో సంభాషించినట్లు తేలింది. ఈ సంభాషణల్లో భాగంగా ప్రధానంగా భారత రక్షణ, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పేట్రేగిపోవాలని సూత్రధారి ఆదేశాలు జారీ చేశాడు. సదరు దాడులు యావత్తు భారత దేశాన్ని భయకంపితులను చేసేలా ఉండాలని కూడా చెప్పాడు. దీంతో ఉగ్రవాదులు తమకు సమీపంలో, చేతికందే దూరంలోని సికింద్రాబాదు కంటోన్మెంట్ ను టార్గెట్ గా ఎంచుకున్నారు. తుపాకులు చేతబట్టి కాల్పులు జరుపుతూ కంటోన్మెంట్ లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కంటోన్మెంట్ ప్రాంతంలో రెక్కీ కూడా నిర్వహించారు. ఈ మేరకు అరెస్టైన ఐదుగురు ఉగ్రవాదులు 12 రోజుల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో ఈ భీతిగొలిపే వాస్తవాలను వెల్లడించారు.