: కమ్యూనిస్టు లీడర్ పన్సారేను ఎలా చంపారంటే... వర్ణించిన 14 ఏళ్ల ప్రత్యక్ష సాక్షి
గతేడాది ఫిబ్రవరి 16న కొల్హాపూర్‌లో జరిగిన కమ్యూనిస్టు నేత గోవింద్ పన్సారే హత్యకు సంబంధించిన వివరాలను ప్రత్యక్ష సాక్షి అయిన 14 ఏళ్ల విద్యార్థి పూసగుచ్చినట్టు వివరించాడు. ‘‘సైకిలుపై స్కూలుకు వెళ్తున్నా. ఒక్కసారిగా బాంబులు పేలిన శబ్దం వినిపించింది. వెంటనే అటువైపు చూశా. మోటార్ సైకిలుపై వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి చేతిలో తుపాకి ఉంది. వచ్చీ రాగానే ఒకతను తుపాకి పేల్చడంతో, తూటా వెళ్లి ఓ మహిళకు తగిలింది. వెంటనే ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నాడు. ఆ సమయంలో బైక్ ఓ సైకిలిస్టును ఢీకొట్టింది. ఆ తర్వాత బైక్‌పై ఉన్న వ్యక్తి ఒకరు కిందికి దిగి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న అజోబా(తాత)ను కాల్చేశాడు. ఆయన కింద పడిపోయాడు. వెంటనే నేను తాత వద్దకు పరిగెట్టుకుంటూ వెళ్లా. నన్ను చూసిన ఓ పెద్దాయన ఆపాడు. ఏం చేస్తున్నావ్? అని ప్రశ్నిస్తూ పారిపో.. పారిపో అన్నాడు. దీంతో సైకిలును తోసుకుంటూనే నేను స్కూలుకు వెళ్లా’’ అని వివరించాడు. గోవింద్ పన్సారే హత్య కేసులో బాలుడు ఒక్కడే ప్రత్యక్ష సాక్షి. ఐడెంటిఫికెషన్ పరేడ్‌లో నిందితులను బాలుడు గుర్తుపట్టాడు. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పన్సారే నాలుగు రోజుల తర్వాత ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, గాయపడిన ఆయన భార్య ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ప్రశ్నలు-సమాధానాల ఫార్మాట్‌లో బాలుడు సమాధానాలు చెప్పినట్టు కొల్హాపూర్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ మొత్తం వివరాలను రికార్డు చేసినట్టు చెప్పారు. మొత్తం 18 ప్రశ్నలకు బాలుడు సమాధానం చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. నిందితులు వాడిన బైక్ రంగును కూడా వివరించాడని అధికారి వివరించారు.