: కండలు పెంచాలంటే కసరత్తులు అక్కర్లేదు... కల కంటే చాలట!
సిక్స్ ప్యాక్... దీన్ని సాధించాలని నిత్యమూ పొద్దున్నే లేచి, గంటల తరబడి వ్యాయామం చేస్తున్న వారు నిత్యమూ ఎందరో కనిపిస్తారు. కానీ, దైనందిన జీవితంలో వ్యాయామం చేయడానికి సమయం లేదని చెప్పేవారు మరెందరో ఉంటారు. ఈ తరహా వారికి బ్రిటన్ శాస్త్రవేత్తలు మరో చక్కటి మార్గం చూపిస్తున్నారు. నిద్రపోయే ముందు వ్యాయామం చేస్తున్నట్టుగా ఊహిస్తూ, నచ్చిన కసరత్తులను చేస్తున్నట్టుగా అనుకుంటే చాలట... తొందర్లోనే కండలు బలపడతాయని ఓ అధ్యయనం చేసి తేల్చారు. నిద్రలో వ్యాయామం చేస్తున్నట్టు కలగనడంపై లఫ్ బెరా యూనివర్శిటీకి చెందిన డాక్టర్ మైకేల్ మోస్లే బృందం ఈ స్టడీ చేసింది. ఇందులో భాగంగా కొంతమందిని ఎంచుకుని వారితో నిజమైన కసరత్తులు చేయిస్తూ, వారి కండరాల్లో కలుగుతున్న మార్పులను అల్ట్రా సౌండ్ సాయంతో లెక్కించారు. ఆపై వారు కసరత్తులు చేస్తున్నట్టు ఊహించేలా చూశారు. వారంలో ఐదు రోజుల పాటు రోజుకు పావుగంట చొప్పున తాము కసరత్తులు చేస్తున్నట్టుగా అనుకునేలా చూశారు. ఆపై తిరిగి అల్ట్రా సౌండ్ పరీక్షలు చేస్తే, 8 శాతం నుంచి 32 శాతం వరకూ వీరికి కొత్త శక్తి, ఉత్తేజం కలిగినట్టు తేలిందని, ఈ ఫలితం తమకు అత్యంత ఆశ్చర్యం కలిగించిందని మోస్లే వెల్లడించారు. మానసిక శిక్షణతో మెదడు వ్యాయామం గురించి ఆలోచించడం, ఆపై ఆ ప్రభావం కండరాలపై పడటమే ఇందుకు కారణమని తెలిపారు.