: చంద్రబాబుకు హైదరాబాదులో ఇక ఓటు హక్కు ఉండదు!... ఆధార్, ఓటరు కార్డుల్లో మారుతున్న చిరునామా!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భాగ్యనగరి హైదరాబాదును పూర్తిగా వదిలేసేందుకే నిర్ణయించుకున్నట్టుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికే విజయవాడ సమీపంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని లింగమనేని హౌస్ ను నివాసంగా మార్చుకున్న ఆయన విజయవాడ నుంచి పాలనను సాగిస్తున్నారు. తాజాగా ఆయన తన ఆధార్ కార్డులోని చిరునామాను మార్చేయాలని ఉండవల్లి గ్రామ పంచాయతీ అధికారులను కోరారు. ప్రస్తుతం తన ఆధార్ కార్డులోని హైదరాబాదు చిరునామాకు బదులుగా ఉండవల్లి అడ్రెస్ ను చేర్చాలని ఆయన కోరారు. ఈ మేరకు తాడేపల్లి మండల అధికారులు చర్యలు చేపట్టారు. పనిలో పనిగా ఓటరు కార్డులోని తన హైదరాబాదు చిరునామాను కూడా మార్చేసి ఉండవల్లి అడ్రెస్ నే చేర్చాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే... ఇకపై హైదరాబాదులో చంద్రబాబుకు ఓటు హక్కు ఉండదు. ఉండవల్లి పంచాయతీలోనే ఆయనకు ఓటు హక్కు ఉంటుంది. అంటే... మంగళగిరి నియోజకవర్గంలో ఆయనకు ఓటు హక్కు ఉంటుందన్న మాట.