: సల్మాన్ ఖాన్ పై ఛీటింగ్ కేసు!.... ‘సుల్తాన్’ హీరోయిన్ అనుష్క, డైరెక్టర్ పై కూడా!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై మరో కేసు నమోదైంది. సల్మాన్ తాజా చిత్రం ‘సుల్తాన్’ కథ తనదేనని, ఈ విషయంలో తనకు సొమ్ము ముట్టజెబుతానని చెప్పి సల్మాన్ మోసం చేశాడని ముజఫర్ పూర్ కు చెందిన మొహ్మద్ సబీర్ అన్సారీ అలియాస్ సబీర్ బాబా దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ముజఫర్ పూర్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ మేరకు సల్మాన్ ఖాన్ పై కేసు నమోదు చేసింది. సల్మాన్ ఖాన్ తో పాటు ‘సుల్తాన్’ చిత్ర హీరోయిన్ అనుష్క శర్మ, దర్శకుడు అలీ జఫార్ అబ్బాస్ లపైనా కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ముజఫర్ పూర్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ చేసిన చీఫ్ జ్యుడిషియల్ కోర్టు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో సల్మాన్, అనుష్క, అబ్బాస్ లపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 420, 406, 504, 506ల కింద కేసు నమోదు చేశారు.