: తెలంగాణలో సాధారణం కంటే 30 శాతం అధిక వర్షపాతం.. కళకళలాడుతున్న జలాశయాలు
తెలంగాణ రాష్ట్రంలో జూలై 11 నాటికి సాధారణం కంటే 30 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాలు విస్తారంగా కురవడంతో వాగులు, వంకలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. చాలావరకు చెరువులు నిండిపోయాయి. ఖమ్మంలో సాధారణం కంటే అత్యధికంగా 63 శాతం వర్షపాతం నమోదవగా అదిలాబాద్‌లో 40, కరీంనగర్లో 34 శాతం వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో జూన్, జూలై నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షం పాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. రాజధానిలో 15 మిల్లీ మీటర్లు, మెదక్‌లో 18 ఎంఎం వర్షం కురిసినట్టు వాతావరణశాఖ డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. తక్కువ వర్షం కురవడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదని, వచ్చే రెండు నెలల్లో ఈ లోటు పూడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.