: ఏడాది క్రితం తప్పిపోయిన బాలుడ్ని పట్టించిన ‘ఫేస్బుక్’
ఢిల్లీలో ఏడాది క్రితం తప్పిపోయిన బాలుడిని సామాజిక మాధ్యమం ఫేస్బుక్ తిరిగి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చింది. బాలుడు శ్రీనగర్‌లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అతడిని తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గతేడాది మే 9న ఢిల్లీలోని ఖజురి ఖాస్ ప్రాంతానికి చెందిన రేఖా దేవి తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాలేదని, చుట్టుపక్కల, బంధువుల ఇంట్లో వెతికినా ఫలితం లేదని పోలీసులకు తెలిపారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బాలుడిదిగా అనుమానిస్తున్న ఓ ఫేస్బుక్ ప్రొఫైల్‌పై నిఘాపెట్టారు. బాలుడు తన పెద్ద అన్న పవన్‌తో నవంబరు 2015 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు చాట్ చేయడాన్ని గుర్తించారు. అయితే తాను ఎక్కడ ఉన్నదీ అన్నకు చెప్పలేదు. దీంతో సైబర్ సెక్యూరిటీ సెల్ సాయం తీసుకున్న పోలీసులు బాలుడు శ్రీనగర్‌లో ఉంటున్నట్టు గుర్తించారు. అక్కడో బియ్యం వ్యాపారి వద్ద పనిచేస్తున్న ఆ బాలుడిని పోలీసులు క్షేమంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. చదువు విషయంలో తన తండ్రి చేస్తున్న ఒత్తిడి భరించలేకే ఇంటినుంచి వెళ్లిపోయినట్టు బాలుడు పోలీసులకు వివరించాడు.