: మహారాష్ట్రలో దారుణం... ఆరేళ్ల కూతురు అంకెలు తప్పుగా చెబుతోందని హింసించిన తండ్రి.. బాలిక మృతి
అంకెలు తప్పుగా చెబుతోందన్న కోపంతో ఓ తండ్రి తన ఆరేళ్ల కూతురును తీవ్రంగా హింసించాడు. దీంతో ఆ చిన్నారి మృతి చెందింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈనెల 9 జరిగిందీ విషాద ఘటన. కుమార్తె మృతితో తట్టుకోలేని తల్లి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. బేరాపూర్ గ్రామానికి చెందిన సంజయ్ కుటే(32) తన కుమార్తె భారతి(6)ని ఇటీవల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్పించాడు. 9వ తేదీ రాత్రి చిన్నారి ఇంట్లో అంకెలు చదువుకుంటూ వల్లెవేస్తోంది. 1 నుంచి 15 అంకెలు నేర్చుకుంటున్న భారతి ప్రతిసారీ 12 అంకెను మర్చిపోతూ 11 తర్వాత 13 అని చదువుతోంది. ఇది గమనించిన సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె చెంప చెళ్లుమనిపించాడు. ఆమె ఏడుపు అందుకోవడంతో ఆపాలనే ఉద్దేశంతో నోట్లో ఉల్లిపాయ కుక్కాడు. అది ప్రమాదవశాత్తు గొంతులోకి దిగడంతో చిన్నారి భారతి స్పృహ కోల్పోయింది. వెంటనే తేరుకున్న తండ్రి దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కుమార్తె మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశాడు. కుమార్తె మృతిని తట్టుకోలేని ఆమె తల్లి సోమవారం రాత్రి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.