: తెలంగాణ మహిళలు ధీశాలురు... మహిళల ఒంటరి ప్రయాణాల్లో రాష్ట్రానికి రెండోస్థానం.. ’ఆంధ్ర’కు ఐదు!


రాత్రి పూట ఒంటరి ప్రయాణాలంటే మహిళలు జంకుతారు. కాస్త భయపడతారు. అయితే ఈ విషయం తెలంగాణకు వర్తించదని తాజా సర్వే ఒకటి తేల్చి చెప్పింది. ఒంటరి మహిళల ప్రయాణాలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. ఈ విషయంలో పంజాబ్ మొదటి స్థానంలో నిలవగా తర్వాతి స్థానాన్ని తెలంగాణ దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచింది. ‘కీ ఇండికేటర్స్ ఆఫ్ డొమెస్టిక్ టూరిజం ఇన్ ఇండియా’ పేరుతో ఈ సర్వే నిర్వహించారు. 2014 జులై నుంచి జూన్ 2015 వరకు తెలంగాణలోని 86 లక్షల ఇళ్లను సర్వే చేశారు. 11 లక్షల మంది మహిళల్లో 60 శాతం మంది రాత్రిపూట ఒంటరి ప్రయాణాలు చేస్తున్నట్టు సర్వేలో తేలింది. ఈ విషయంలో పంజాబ్ 66 శాతంతో మొదటి స్థానంలో ఉంది. దక్షిణాది ప్రాంతంలోని ప్రజలకు విశాల దృక్ఫథం ఎక్కువని, కాబట్టే వారు మహిళలను ఒంటిరిగా బయటకు పంపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ‘‘దేశంలోని మిగతా ప్రాంతాల వారు సంప్రదాయవాదులు. వారు మహిళలను ఒంటరిగా బయటకు పంపించేందుకు ఇష్టపడరు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. మహిళల ఒంటరి ప్రయాణాలకు వారు అడ్డు చెప్పరు’’ అని మహిళా ట్రావెల్ కంపెనీ ‘వాండర్ గర్ల్స్’ వ్యవస్థాపకురాలు హెటెల్ దోషి పేర్కొన్నారు. తెలంగాణలో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు తోడు(కంపెనీ) కూడా కోరుకోరని అన్నారు. తెలంగాణ తర్వాతి స్థానాల్లో కేరళ(58), తమిళనాడు(55), ఆంధ్రప్రదేశ్(53) ఉన్నాయి. ఈ ప్రయాణాలు చాలా వరకు ఆరోగ్యం, మందులు, షాపింగ్, విహారయాత్ర తదితరాల కోసం జరుగుతున్నట్టు సర్వే పేర్కొంది. తెలంగాణలో సగటున ఓ మహిళా ట్రావెలర్ ఆరోగ్యం సంబంధ ప్రయాణాల కోసం ఏడాదికి రూ.17,470 ఖర్చు చేస్తుండగా షాపింగ్ ప్రయాణాల కోసం రూ.12,122, హాలీడేల కోసం రూ.7,311 ఖర్చు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News