: జైలు గోడల నుంచి బయటకొచ్చిన హార్దిక్ పటేల్!... సత్యమే గెలిచిందని ప్రకటన!
గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం గొంతెత్తి పోరాడి దేశంలోనే ‘యువ సంచలనం’గా పేరొందిన హార్దిక్ పటేల్ కు ఎట్టకేలకు నిన్న జైలు గోడల నుంచి విముక్తి లభించింది. జైలు నుంచి విడుదలైనా... గుజరాత్ కు ఆరు నెలల పాటు దూరంగా ఉండాలన్న కోర్టు షరతు నేపథ్యంలో ఆయన ఇప్పట్లో సొంతూరికి వెళ్లే అవకాశం లేదు. గుజరాత్ పొరుగు రాష్ట్రాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో ఆయన ఈ ఆరు నెలల పాటు తలదాచుకోక తప్పడం లేదు. జైలు నుంచి విడుదలైన సందర్భంగా ‘సత్యమేవ జయతే’ పేరిట ఓ బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. తన సామాజిక వర్గానికి న్యాయమైన రిజర్వేషన్ల కోసం తాను రోడ్డెక్కితే... గుజరాత్ సర్కారు మాత్రం తనను జైలు పాలు చేసిందని ఆయన ఆ లేఖలో ఆరోపించారు. చివరకు సత్యమే గెలిచిందని పేర్కొన్న హార్దిక్... భవిష్యత్తులోనూ తాను పటేళ్లకు రిజర్వేషన్ల కోసం ఉద్యమం సాగిస్తానని ప్రకటించారు. ‘‘సత్యమే గెలిచింది. భారత న్యాయవ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ దేశంలో అమాయకులకు, పేదలకు న్యాయం దక్కుతుందని నేను నమ్ముతున్నాను’’ అని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక తొమ్మిది నెలల జైలు జీవితంలో దేశంలోని నీచ రాజకీయాలను ఎలా ప్రక్షాళన చేయాలన్న విషయాన్ని నేర్చుకున్నానని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.