: హస్తిన చేరిన తెలుగు రాష్ట్రాల ‘పాల’ పోరు!... 15న కేంద్రం కీలక చర్చలు!


తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న ‘పాల’ పోరు కూడా ఇతర వివాదాల మాదిరే హస్తిన చేరింది. విజయా బ్రాండ్ పాల విక్రయాలపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రమంలో ఈ నెల 15న ఢిల్లీకి రావాలని ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ‘విజయా’ బ్రాండ్ పేరిట ప్రభుత్వం పాలను విక్రయించింది. ఏపీ డెయిరీ సమాఖ్య ద్వారా కొనసాగిన ఈ వ్యాపారం... తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఇరు రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాలు కూడా ‘విజయా’ బ్రాండ్ పేరిటే పాలను విక్రయిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ‘విజయా’ పాత బ్రాండ్ తోనే ఈ వ్యాపారం చేస్తుండగా, తెలంగాణ సర్కారు మాత్రం ‘విజయా’ బ్రాండ్ కు ‘తెలంగాణ’ ట్యాగ్ తగిలించి... తెలంగాణ పాడి సమాఖ్య ద్వారా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఏపీ సర్కారు తన భూభాగంలో సేకరిస్తున్న పాలను తెలంగాణలోని పాలమూరు జిల్లా పరిధిలోని సాంబశివా డెయిరీ వద్ద ప్రాసెస్ చేసి ‘విజయా’ బ్రాండ్ తో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తోంది. ఈ విషయం తెలిసిన తెలంగాణ పాడి సమాఖ్య... సదరు పాలు తమవి కావని, ఆ పాలు కల్తీవని ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై ఏపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పాలు కల్తీవి కావని, తమ పాలను సాంబశివా డెయిరీ కేవలం ప్రాసెస్ మాత్రమే చేస్తోందని, ఈ విషయంలో తెలంగాణ పాడి సమాఖ్య ప్రకటన పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. వెరసి రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం మరింత ముదిరింది. ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యత కేంద్రం తీసుకోవడంతో ఇరు రాష్ట్రాలకు చెందిన పాడి సమాఖ్యల అధికారులు ఈ నెల 15న ఢిల్లీ వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News