: బందరు పోర్టు వ్యవహారంలో విపక్షాలది అనవసర రాద్ధాంతం: కొల్లు రవీంద్ర
బందరు పోర్టు భూసమీకరణ విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, వామపక్షాలు తమ ఉనికి కోసం రైతులను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. గతంలో వైఎస్ హయాంలో మూడున్నర లక్షల ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులకు భూములు ధారాదత్తం చేయడంలో పాలుపంచుకున్న ధర్మాన ప్రసాదరావు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్యకు ఏపీ అభివృద్ధి చెందడం ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. బందరు పోర్టు కోసం ఇష్టపూర్వకంగా ఇచ్చిన వారి నుంచి మాత్రమే భూములు సమీకరిస్తున్నామని ఆయన తెలిపారు.