: ఆజాద్ తో ప్రియాంక భేటీ... ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంపైనే!
2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున ప్రచారకర్త బాధ్యతలను ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక వాద్రా నిర్వర్తించనున్నారన్న ఊహాగానాల నడుమ... కాంగ్రెస్ సీనియర్ నేత, యూపీ ఇన్ ఛార్జ్ గులాం నబీ ఆజాద్ తో ప్రియాంక వాద్రా సమావేశమయ్యారు. ఢిల్లీలోని ఆజాద్ నివాసంలో సుమారు గంటపాటు వీరిరువురూ పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఎదురయ్యే సవాళ్లు, ఆయా అంశాలపై ఇవ్వాల్సిన సమాధానాలపై ప్రియాంక ఆరాతీస్తున్నారు. డీఎఫ్ఎల్ కుంభకోణంలో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పేరు ప్రముఖంగా వినిపిస్తుండడంతో ఆ దిశగా బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ విమర్శలు సంధించే అవకాశం ఉందని, వాటిని తిప్పికొట్టే దిశగా ఆమె సన్నద్ధమవుతున్నారని సమాచారం. తాజా భేటీతో ప్రియాంక యూపీ ఎన్నికల ప్రచార బాధ్యతలు భుజాన వేసుకోనున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది.