: కర్ఫ్యూని సైతం లెక్కచేయని ముస్లిం దంపతులు... హిందూ కుటుంబం ఆకలి తీర్చిన వైనం!
శ్రీనగర్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నాలుగు రోజుల నుంచి కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో, దుకాణాలు మూతపడటం, రవాణ వ్యవస్థ స్తంభించిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నిత్యావసరాలు ఇంట్లో లేకపోవడంతో పస్తులుంటున్న కుటుంబాలు కూడా వున్నాయి. ఇటువంటిదే ఒక హిందూ కుటుంబం... ఈ కుటుంబం జీలం నదికి ఆవల ఉన్న జవహర్ లాల్ నగర్ లో నివసిస్తోంది. గత రెండు రోజులుగా దివాన్ చంద్ పండిట్ ఇంట్లో సరుకులు నిండుకోవడంతో ఆయన కుటుంబసభ్యులు పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. దివాన్ చంద్ నాయనమ్మ కూడా వారితో పాటే ఉంటోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కూడా పస్తులుంచాల్సిన పరిస్థితి రావడంతో, దివాన్ చంద్ భార్య తన భర్త స్నేహితుడైన ఒక ముస్లిం ఫ్రెండ్ భార్య జుబేదా బేగమ్ కు నిన్న ఉదయం ఫోన్ చేసి తమ పరిస్థితిని తెలియజెప్పింది. దీంతో, చలించిపోయిన జుబేదా బేగమ్... కొన్ని సరుకులు సంచిలో పెట్టుకుని తన భర్తను వెంటబెట్టుకుని కాలినడకన బయలుదేరింది. కర్ఫ్యూ అమల్లో ఉండటంతో భద్రతా బలగాలు వారిని ప్రశ్నించాయి. అసలు విషయం వారికి చెప్పి ఒప్పించారు. మధ్యమధ్యలో రాళ్లు రువ్వుకుంటున్న సంఘటనలను సైతం వారు లెక్కచేయక ముందుకు సాగిన ముస్లిం దంపతులు ఆ హిందూ కుటుంబం ఆకలి తీర్చారు. కాగా, ఈ విషయం ఎలా వెలుగు చూసిందంటే... దివాన్ చంద్ కుటుంబానికి సరుకులు అందించేందుకు నడిచి వెళుతున్న జుబేదా బేగమ్ దంపతులకు మార్గమధ్యంలో ఒక మీడియా ప్రతినిధి తారసపడ్డారు. ఈ విషయాన్ని సదరు ప్రతినిధికి ఆమె చెప్పడం జరిగింది.