: స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ 'తొలిప్రేమ' విషాదమేనట!
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ జీవితకథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎం.ఎస్. ధోనీ- ద అన్ టోల్డ్ స్టోరీ’. ధోనీ గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ చిత్రంలో ఉన్నాయని చిత్ర బృందం చెబుతున్న విషయం తెలిసిందే. ధోనీ తొలిప్రేమను కూడా ప్రత్యేకంగా తెరకెక్కించినట్లు సమాచారం. టీమిండియాలోకి ధోనీ రాకముందు రాంచీలో ప్రియాంక ఝా అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడట. కానీ, దురదృష్టం కొద్దీ, ఓ ప్రమాదంలో ప్రియాంక చనిపోయింది. ఈ సంఘటనతో షాక్ కు గురైన ధోనీ రాంచీలో ఉండలేకపోయాడు. అప్పటికే, టీమిండియా నుంచి ధోనీకి పిలుపు రావడంతో అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించాడు. ప్రియాంక సంఘటన ఒక ఏడాదిపాటు ధోనీని వెంటాడటం.. కాలక్రమంలో దాని నుంచి బయటపడటం జరిగింది. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షి సింగ్ రావత్ ను ధోనీ పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే, తన వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పేందుకు ఎక్కువగా ఇష్టపడని ధోనీ తొలిప్రేమ ఈ చిత్రం ద్వారా వెలుగుచూడనుండటం గమనార్హం.