: నలుగురూ అంటున్న మాటలు చెప్పానే తప్ప, జైట్లీ పరువు నేనేమీ తీయలేదు: కోర్టుకు తెలిపిన కేజ్రీవాల్
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పరువును తీసేలా తానేమీ వ్యాఖ్యలు చేయలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఆయనపై సమాజంలో బహిరంగంగా వినిపిస్తున్న వ్యాఖ్యలను చెప్పానే తప్ప, తన అభిప్రాయాలు, సొంత వ్యాఖ్యానాలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా హైకోర్టుకు కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో గతంలో జరిగిన అవకతవకలకు సంబంధించి, తనకేమీ సంబంధం లేకున్నా కేజ్రీవాల్ తనపై ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించారని జైట్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ సహా, పలువురు ఆప్ నేతలపై రూ. 10 కోట్ల దావాను జైట్లీ వేయగా, దీనిపై కోర్టు అభియోగాలు నమోదు చేసి నోటీసులను పంపింది. వీటిపై కేజ్రీవాల్ నేడు స్పందించారు.