: చిన్నారి రమ్య మృతి ఘటన తరువాతయినా మారని తీరు... యథేచ్చగా మైనర్లకు మద్యం
హైదరాబాద్‌లో మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ మైనర్లు అమాయక ప్రజలను బలి తీసుకుంటోన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నా బార్లపై చర్యలు తీసుకుంటోన్న దాఖలాలు కనిపించడం లేదు. ఇటీవల అభం శుభం ఎరగని చిన్నారి రమ్య మృతి అందరిలోనూ బాధను నింపిన సంగతి తెలిసిందే. మైనర్లకు మందు అందకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు, అధికారులు ఆ సందర్భంగా చెప్పినప్పటికీ బార్ల ముందు, బార్ల బయట మైనర్లు పదుల సంఖ్యలో కనపడుతున్నారు. హైదరాబాద్ లో మైనర్లకు యథేచ్చగా మద్యం సరఫరా చేస్తోన్న ఈ వైనాన్ని ఓ తెలుగు టీవీ ఛానల్ వెలుగులోకి తెచ్చింది. పలు బార్లను పరిశీలించింది. ప్రతీ చోట మైనర్లను అనుమతినిస్తూ బార్ల యాజమాన్యాలు కాసుల కోసం ఆరాటపడడం కనిపించింది. మైనర్లు పట్టపగలే తప్పతాగేస్తున్నారు. ఆపై ద్విచక్ర వాహనాలు, కార్లను వేసుకొని రోడ్లపైకి వస్తున్నారు. ఈ తీరు రాత్రి పూట మరీ విపరీతంగా కనిపిస్తోంది. బార్ల యాజమాన్యాలు కాసుల కోసం మైనర్లకు ఆఫర్లు ప్రకటించి మరీ ఆకర్షిస్తున్నాయి. రూల్స్ తో నిండి ఉన్న బోర్డులను ముందు పెట్టుకొని, మరోవైపు బారులోకి వచ్చేవారి వయసు అడగకుండా, ఐడీ కార్డులు చెక్ చేయకుండా మైనర్లకు మందు అమ్మేస్తున్నారు. మైనర్లు బార్లలో ఫుల్లుగా మందు కొడుతూ కనపడుతున్నారు.