: సింగపూర్ లో 1900 ఎకరాల్లో నౌకాశ్రయాలుంటే, ఇక్కడ 4,800 ఎకరాలెందుకు?: బాబుకు విపక్షాల సూటి ప్రశ్న
"నాకు సింగపూర్ ఆదర్శం" అని చెప్పుకునే చంద్రబాబు, అక్కడ కూడా అమలులో లేని విధానాలను, భూ సేకరణ పద్ధతులను రాష్ట్రంలో అవలంబిస్తున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. బందరు పోర్టు కోసం భూములను కోల్పోనున్న రైతుల తరఫున పోరాటానికి దిగిన విపక్షాలు, ఈ మధ్యాహ్నం మచిలీపట్నంలో సదస్సు నిర్వహించగా, పలువురు నేతలు ప్రసంగించారు. సింగపూర్ లో కేవలం 1900 ఎకరాల్లో 84 బెర్తుల పోర్టును నిర్వహిస్తున్నారని గుర్తు చేసిన వడ్డే, బందరు పోర్టుకు 4,800 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. గంగవరం పోర్టే 1800 ఎకరాల్లో నడుస్తోందని గుర్తు చేశారు. ఇదే సదస్సులో వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు ప్రసంగిస్తూ, రైతుల నుంచి భూములను అప్పనంగా కొట్టేసి, ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చంద్రబాబు ప్లాన్ వేశారని ఆరోపించారు. రైతులకు అన్యాయం చేసే చర్యలు తగవని, అభివృద్ధి పేరు చెబుతూ అరాచకాలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చంద్రబాబునాయుడికి భూమి పిచ్చి పట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిప్పులు చెరిగారు. అవినీతిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.