: 10 సెకన్లలో రూ. 10 లక్షల రుణమిచ్చే బ్యాంకులు!
మీరు ఏదైనా రుణం కావాలని బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్నారా? అసలు బ్యాంకులో అడుగు కూడా పెట్టకుండానే, మీ ఖాతా, దానిలోని లావాదేవీలను పరిశీలించి పది సెకన్ల వ్యవధిలో రూ. 10 లక్షల వరకూ రుణాన్ని మంజూరు చేసే రోజులు అత్యంత సమీపంలో ఉన్నాయి. చిన్న మొత్తాల రుణాల జారీని ఇప్పటికే ఆటోమేషన్ విధానానికి మార్చిన బ్యాంకులు ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తున్నాయి. రుణాల మంజూరును మరింత పారదర్శకంగా ఉంచడంతో పాటు, తిరిగి వసూలుకు ముందు కస్టమర్ గత చరిత్రనంతా తిరగదోడే సాఫ్ట్ వేర్ చేతుల్లో ఉండటమే ఇందుకు కారణం. గత సంవత్సరం ఐబీఎం తయారు చేసిన స్టాటిస్టికల్ అనాలిసిస్ సాఫ్ట్ వేర్ ప్యాకేజీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిపుచ్చుకుంది. బ్యాంకు డేటాబేస్ మొత్తాన్నీ చుట్టి వస్తుండే ఈ సాఫ్ట్ వేర్, ఓ ఖాతాలోని లావాదేవీలను, అతనికి వస్తున్న ఆదాయం, సేవింగ్స్ మొత్తాన్నీ క్షణాల్లో సమీక్షించి, ఎంత మొత్తం రుణమిస్తే, ఎంత కాలంలో చెల్లించగలుగుతాడన్న విషయాన్ని కంటి ముందుంచుతుంది. దీన్ని వాడిన ఎస్బీఐ అధికారులు, బ్యాంకు ఖాతాదారుల్లో దాదాపు 10 లక్షల మందికి పైగా ఇన్ స్టంట్ రుణానికి అర్హులని గుర్తించారు. ఇదే విషయాన్ని వెల్లడించిన బ్యాంకు టెక్నాలజీ విభాగం ఎండీ, రజనీ కుమార్, గతంలో క్రెడిట్ కార్డు హోల్డర్లకు మాత్రమే ఈఎంఐ సదుపాయాన్ని కల్పించేవాళ్లమని, ఇప్పుడు ఈ 10 లక్షల మంది డెబిట్ కార్డు దారులకు కూడా నెలసరి కిస్తీల చెల్లింపును దగ్గర చేస్తున్నామని తెలిపారు. ఒక్క ఎస్బీఐ మాత్రమే కాదు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా 10 సెకన్లలో రుణ మంజూరును మొదలు పెట్టింది. రుణం కావాలంటూ బ్యాంకు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కు సమాచారం ఇస్తే చాలు. అది కూడా ఆన్ లైన్ లేదా ఏటీఎం నుంచి రిక్వెస్ట్ పెట్టినా సరిపోతుంది. వెంటనే రుణం మంజూరుపై సమాచారం అందించే సేవలు దగ్గర చేసింది. వ్యక్తిగత అవసరాల నిమిత్తం రుణాలు పొందుతున్న వారిలో ఎగవేతదారుల సంఖ్య చాలా తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అందువల్లే తాము ఈ తరహా రుణాల మంజూరును వేగవంతం చేసినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణాల విభాగం హెడ్ అరవింద్ కపిల్ తెలిపారు. బ్యాంకు సాఫ్ట్ వేర్ మాత్రమే వీటిని మంజూరు చేస్తుందని తెలిపారు. ఇక ఐసీఐసీఐ అయితే, ఏకంగా కంప్యూటర్ల ద్వారానే గృహ రుణాలను ఇచ్చే వ్యవస్థను మొదలు పెట్టింది. అయితే, ఇక్కడ గరిష్ఠంగా 8 గంటల సమయాన్ని బ్యాంకు తీసుకుంటుంది. ఖాతాదారు బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదు. నిర్మాణంలోని తన ఇంటి ప్రాజెక్టును చూపుతూ ఎంత కావాలో డిమాండ్ చేస్తే, ఆ డబ్బును దశలవారీగా బ్యాంకు రుణం రూపంలో అందిస్తుంది. అయితే, ఆ రుణంతో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు బ్యాంకుకు తెలియజేస్తుండాలి. ఐడీఎఫ్సీ, సీటీ తదితర బ్యాంకులు సైతం రుణ మంజూరును త్వరితగతిన పూర్తి చేసేందుకు సాఫ్ట్ వేర్ ను నమ్ముకున్న బ్యాంకుల జాబితాలో చేరిపోయాయి.