: పాంపోర్ ఉగ్రదాడిని స్వాగతించిన బుర్హాన్ వని!... ఎన్ కౌంటర్ కు కారణమిదేనట!
జమ్ము కశ్మీర్ లో అల్లకల్లోలానికి కారణమైన హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ కు అసలు కారణాలు తెలిసివచ్చాయి. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఉగ్రవాద నిరోధక దళానికి చెందిన ఓ అధికారిని ఉటంకిస్తూ ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఈ కథనం మేరకు... చాలా కాలంగా కశ్మీర్ లో బుర్హాన్ తన అనుచరులతో కలిసి ఆయుధాలు చేతబట్టుకుని సంచరిస్తున్నాడు. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో సంపన్న కుటుంబాలకు చెందిన యువతను దేశ వ్యతిరేక కార్యకలాపాల వైపు మొగ్గేలా చర్యలు చేపడుతున్నాడు. ఇటీవల కశ్మీర్ లోని పాంపోర్ లో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిని స్తుతిస్తూ అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థానీ ఉగ్రవాదులను సోదరులుగా అభివర్ణించిన అతడు... దాడిలో 8 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన విషయాన్ని తన అనచరులకు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో బుర్హాన్ చర్యల కారణంగా నానాటికీ హింస పెచ్చరిల్లుతోంది. ఎంతకాలమని ఉగ్రవాద ప్రోత్సాహక చర్యలను చూస్తూ ఊరుకుంటామని భావించిన భద్రతా దళాలు ఎన్ కౌంటర్ లో అతనిని అంతం చేసేశాయి.