: తమిళనాడులో నడిరోడ్డుపై పోలీసుల అత్యుత్సాహం.. కుటుంబాన్ని చితకబాదిన వైనం
ప్రజలందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై పోలీసులు రెచ్చిపోయి ఓ కుటుంబాన్ని చితకబాదిన ఘటన తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా చెంగంలో చోటుచేసుకుంది. దళిత కుటుంబంపై పోలీసులు చేసిన ఈ దాడిపట్ల స్థానికులు మండిపడ్డారు. బంగారు ఆభరణాలు కొనుక్కునేందుకు రాజా(45), ఉష(40) దంపతులు తమ కుమారుడు సూర్య(18)తో కలిసి దుకాణానికి వెళ్లి, షాపులో నుంచి బయటకు వచ్చారు. అంతలోనే కుటుంబ సభ్యులు వారిలో వారు గొడవ పడుతున్నారు. విషయాన్ని గమనించిన పోలీసులు అనవసరంగా వారితో కల్పించుకున్నారు. రాజా కుటుంబం పట్ల పోలీసులు దురుసు ప్రవర్తన కనబర్చారు. తమలో తమకు వచ్చిన విభేదాల కారణంగా స్వల్పంగా గొడవ పడుతున్నామని ఆ కుటుంబం పోలీసులకి చెప్పినా పోలీసులు తమ తడాఖా చూపిస్తాం అన్నట్లు ప్రవర్తించారు. రాజా కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్లు లాఠీలతో కొట్టారు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. రాజా, ఉష, సూర్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు కుటుంబంపై విరుచుకుపడ్డ పోలీసులని వేరే ప్రాంతానికి బదిలీ చేశారు.