: నేడు ఒక్కరోజే కోటి మొక్కలు నాటే లక్ష్యంతో తెలంగాణలో ఉద్యమంలా కొనసాగుతోన్న హరితహారం


అడ‌వుల శాతాన్ని పెంచి, రాష్ట్రాన్ని ప‌చ్చ‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణలో చేపట్టిన హరితహారం కార్యక్రమం జోరుగా కొన‌సాగుతోంది. నేడు ఒక్కరోజే కోటి మొక్కలు నాటాల‌నే లక్ష్యంతో తెలంగాణ‌ పంచాయతీరాజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పంచాయ‌తీరాజ్ ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది జిల్లాల్లో ఈరోజు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. 8 వేలకు పైగా గ్రామాల్లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. తెలంగాణ‌లోని ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో 10 లక్షల చొప్పున‌ మొక్కలు నాట‌నున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్య‌ధికంగా 15 లక్షల మొక్క‌లు నాట‌నున్నారు. నల్లగొండలో 12 లక్షలు, రంగారెడ్డిలో 6 లక్షలు, కరీంనగర్ లో 11 లక్షలు, వరంగల్ లో 16 లక్షల మొక్క‌లు నాట‌నున్నారు. మెద‌క్‌లోని ములుగు గురుకుల పాఠ‌శాల‌, జూనియ‌ర్ కాలేజ్‌లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొన్నారు. మ‌రోవైపు హైద‌రాబాద్‌లోనూ ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌లు, తెలంగాణ మంత్రుల ఆధ్వ‌ర్యంలో హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. సోమాజిగూడ విద్యుత్‌సౌధ కార్యాలయంలో మొక్క‌లు నాటే కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగులందరూ హరితహారంలో పాల్గొనాలని, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో 3 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించామని ఆయ‌న జ‌గ‌దీశ్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్స్‌లో హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప‌ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ ఆలీ, మంత్రులు పోచారం, ప‌ద్మారావ్‌, న‌గ‌ర మేయ‌ర్ రామ్మోహ‌న్‌ పాల్గొని మొక్క‌లు నాటారు. హ‌రిత‌హారంలో ప్ర‌జ‌లంద‌రూ పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు పాల్గొనాల‌ని వారు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని బోయిగూడ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మంత్రి త‌ల‌సాని, కార్పొరేట‌ర్ హేమ‌ల‌త విద్యార్థుల‌తో క‌లిసి మొక్క‌లు నాటారు. అనంత‌రం త‌ల‌సాని హైద‌రాబాద్‌లోని తెలంగాణ ప‌శు సంక్షేమ శాఖ భ‌వ‌న్‌లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి అక్కడి సిబ్బందిని ప్రోత్సహించారు.

  • Loading...

More Telugu News