: కత్తి చేతబట్టిన బ్రిటన్ వీర జవాను!... బెంబేలెత్తిన ఐఎస్ ముష్కరులు!
కదన రంగంలో అసాంఘిక శక్తుల ఆట కట్టించడంలో ఆయా దేశాల సైనికులు అత్యంత ధైర్య సాహసాలు చూపుతున్నారు. ఇటీవల పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి చేసిన ఉగ్రవాదులకు ఎదురొడ్డిన గరుడ కమాండర్ శైలేశ్ గౌర్ సాహసం ఇంకా మన కళ్ల ముందే కదలాడుతోంది. గౌర్ వీరావేశం చూసిన ఉగ్రవాదులు కాళ్లకు బుద్ధి చెప్పి ప్రాణభయంతో దాక్కోవాల్సి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలను హడలెత్తిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ముష్కరులకు కూడా పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు బెంబేలెత్తిన తరహా అనుభవమే ఎదురైంది. ఇరాక్ లోని ఫల్లూజాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐఎస్ ముష్కరులను బెంబేలెత్తించిన వీర సైనికుడు బ్రిటన్ కు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ (ఎస్ఏఎస్) సైనికుడట. మెషీన్ గన్లతో తనను చుట్టుముట్టిన ఐఎస్ ముష్కరులకు ఏమాత్రం వెన్ను చూపని ఆ సైనికుడు నేపాలీ గుర్ఖాలు వాడే వంకర కత్తి కుర్కీతో చెలరేగిపోయాడు. ముగ్గురు ఐఎస్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆ సైనికుడు మరో ముగ్గురిని సజీవంగా పట్టుకున్నాడు. ఫల్లూజాలో ఇటీవల అమెరికా దాడులతో బాగా బక్కచిక్కిన ఐఎస్ ను నామరూపాల్లేకుండా చేసేందుకు ఆ నగరంలో ఇరాకీ సైనికులతో కలిసి బ్రిటన్ సైనికులు కూడా ప్రత్యేక ఆపరేషన్ కొనసాగించారు. అందులో భాగంగా నగరంలోని ఓ పాడుబడ్డ కంపెనీలోకి వెళ్లిన సైనిక పటాలాన్ని ఐఎస్ ముష్కరులు రౌండప్ చేసి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో చాలా మంది ఇరాకీ సైనికులు చనిపోయారు. అయితే ఎస్ఏఎస్ సైనికుడితో పాటు మరికొందరు ఆ కాల్పుల నుంచి చాకచక్యంగా తప్పించుకుని ఉగ్రవాదులపైకి కాల్పులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అంతా చెల్లాచెదురైపోయారు. అంతలో ఎస్ఏఎస్ సైనికుడి తుపాకీలోని బుల్లెట్లు అయిపోయాయి. విషయాన్ని గమనించిన ఐఎస్ ముష్కరులు అతడిని చుట్టుముట్టారట. అతడిని సజీవంగా పట్టుకునేందుకు యత్నించాడు. అయితే ఐఎస్ తుపాకులకు ఏమాత్రం వెరవని ఆ సైనికుడు నడుముకు ఉన్న ‘కుర్కీ’ కత్తిని బయటకు తీసి ఓ ఐఎస్ ముష్కరుడి గొంతు కోసేశాడు. ఈ షాక్ నుంచి ముష్కరులు తేరుకునేలోగానే ఆ సైనికుడు మరో ఇద్దరు ఉగ్రవాదులను రెండంటే రెండు కత్తిపోట్లతో మట్టుబెట్టేశాడు. ఇక మరో ముగ్గురు ఉగ్రవాదులను కత్తితో గాయాలు చేసి సజీవంగా పట్టేశాడు. ఆ తర్వాత అతడిపై దాడి చేసేందుకు అప్పటికే అక్కడికి పరుగు పరుగున వచ్చిన ఐఎస్ ముష్కరులు అతడి వీరావేశం చూసి పరుగు లంకించుకున్నారు.