: ఢాకా ఉగ్రదాడి ప్రత్యక్ష సాక్షులు మాయం!


ఈనెల 1వ తేదీన ఢాకాలోని బేకరీ రెస్టారెంట్ పై ఉగ్రవాదుల దాడి కేసులో ప్రత్యక్ష సాక్షులైన తహ్మీద్ హసీబ్ ఖాన్, హస్నత్ ఆర్ కరీమ్ లు కనిపించకుండా పోవడం కలకలం కలిగిస్తోంది. దాదాపు 12 గంటల పాటు ఉగ్రవాదులతో పోరాడిన సైన్యం 30 మంది బందీలను విడిపించగా, వీరిలో తహ్మీద్, హస్నత్ లు కూడా ఉన్నారు. మిగతా వారందరినీ ఆ రోజే ప్రశ్నించి వదిలిపెట్టిన పోలీసులు, వీరిద్దరినీ మాత్రం తమ అదుపులోనే ఉంచుకున్నారు. ఆపై వీరిని 6వ తేదీన విడుదల చేశామని పోలీసులు చెబుతుండగా, వీరు ఇళ్లకు చేరలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తహ్మీద్, యూనివర్శిటీ ఆఫ్ టొరంటో విద్యార్థి కాగా, హస్నత్, నార్త్ సౌత్ యూనివర్శిటీలో మాజీ ఉపాధ్యాయి. విచారణ తరువాత వీరిద్దరినీ వదిలిపెట్టామని ఢాకా మెట్రోపాలిటన్ డిప్యూటీ కమిషనర్ ఆప్ పోలీస్ మసూదుర్ రెహమాన్ స్పష్టం చేస్తున్నారు. పోలీసు కస్టడీ నుంచి బయటకు వచ్చిన వారు, ఇంటికి చేరకపోవడంతో, ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వీరిద్దరి ఆచూకీ కోసం సామాజిక మాద్యమాల్లో ప్రచారం సాగుతోంది. తమ బిడ్డలను ప్రశ్నించాలని భావిస్తే, ఆ పని చేయవచ్చని, ముందుగా వారిని ఎక్కడ ఉంచారో కనీస సమాధానం చెప్పాలని తహ్మీద్ తండ్రి షరియార్ ఖాన్ పోలీసులను డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News