: హింసాత్మకంగా మారిన ప్రాంతాన్ని నేడు సందర్శించనున్న ఒబామా, జార్జ్ బుష్
అమెరికాలో నల్లజాతీయులపై జరుగుతోన్న కాల్పులకు నిరసనగా ఇటీవల డలాస్ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన సంగతి విదితమే. ఆందోళనకారుల్లో ఒకరు జరిపిన కాల్పులతో అక్కడ ఐదుగురు పోలీసులు మరణించారు. ఈరోజు ఆ ప్రాంతంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటించనున్నారు. మృతుల సంస్మరణ కోసం అక్కడ సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీనిలో ఒబామా పాల్గొని, బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా పాల్గొననున్నారు. మరోవైపు చిన్న చిన్న కారణాలకే తమపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారంటూ నల్లజాతీయులు చేస్తోన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనలు చేస్తోన్న వారిని పెద్ద సంఖ్యలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.