: సెయింట్ లూసియా పౌరసత్వం కోసం లలిత్ మోదీ దరఖాస్తు!
విశ్వవ్యాప్తంగా భారీ ఆదరణ లభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రాణం పోసిన లలిత్ మోదీ... అవినీతి కేసుల్లో భారత్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు. ఓ వైపు తనపై విచారణ ప్రారంభం కాగానే ఆయన తన భార్య అనారోగ్యానికి చికిత్స పేరిట లండన్ పారిపోయారు. ఇక అక్కడి నుంచి వచ్చేది లేదని దాదాపుగా తేల్చేసిన లలిత్... తాజాగా పన్ను ఎగవేతకు స్వర్గధామంగా పేరుగాంచిన సెయింట్ లూసియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు అతడు గత నెలలోనే దరఖాస్తు చేసుకున్న వైనం కాస్తంత ఆలస్యంగా వెలుగుచూసింది. తనతో పాటు తన భార్య మృణాళిని, పిల్లల చేత కూడా ఆయన సెయింట్ లూసియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేయించారు. అయితే ఈ దరఖాస్తులను పెండింగ్ లో పెట్టిన సెయింట్ లూసియా... అతడికి సంబంధించిన గత చరిత్రను తెలపాలంటూ భారత్ ను కోరింది. సెయింట్ లూసియాలోని ఇంటర్ పోల్ విభాగం భారత్ లోని తన విభాగానికి ఈ మేరకు ఓ లేఖ రాసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు లలిత్ మోదీకి సెయింట్ లూసియా పౌరసత్వం దక్కే అవకాశాలు లేవట. భారత్ అందించే నివేదిక ఆధారంగానే సెయింట్ లూసియా లలిత్ మోదీ పౌరసత్వంపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పెను వివాదాలు రేపిన లలిత్ మోదీకి భారత్ క్లీన్ చిట్ ఇచ్చే పరిస్థితి లేదన్నది ఆ వర్గాల భావన. భారత్ నుంచి క్లీన్ చిట్ లేకుండా సెయింట్ లూసియా మోదీకి పౌరసత్వం ఇచ్చే అవకాశాలు లేవని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.